
మెదక్ (చేగుంట), వెలుగు: చేగుంటలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించాలని డిమాండ్ చేస్తూ సోమవారం పేదలు ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. 108 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తి అయి ఐదేళ్లవుతున్నా ఎవరికి కేటాయించక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఇండ్లను ఇవ్వడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని నిలదీశారు. కిరాయి ఇండ్లలో అరకొర వసతుల మధ్య ఇబ్బందులు పడుతూ జీవనం సాగిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కూలీ నాలి చేసుకుని బతుకులు వెల్లదీసే తాము కిరాయి కట్టడం ఇబ్బందిగా ఉందన్నారు.
ఎవరైనా చనిపోతే ఇంటి ఓనర్లు డెడ్ బాడీ లను ఇంట్లోకి తీసుకువెళ్లనివ్వడం లేదని, రోడ్డు మీదనే అంత్యక్రియలు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతోందన్నారు. ప్రభుత్వం స్పందించి సొంతగా ఇళ్లు కట్టుకునే ఆర్థిక స్తోమత లేని పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రాస్తారోకో కారణంగా చేగుంట ప్రధాన రహదారిపై గంట పాటు ట్రాఫిక్ స్తంభించింది. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని నచ్చచెప్పడంతో ఆందోళన విరమించారు.